యేసు క్రీస్తు పునరుత్థానము నుండి ఆరోహణం వరకు జరిగిన సంఘటనలు jesus crucification to resuruction

క్రైస్తవ విశ్వాసానికి మూలం యేసు క్రీస్తు పునరుత్థానము (1 కొరింథీ 15:12-34) అయన పునరుత్థానము మీద క్రీస్తు విరోధులు మొదటి శతాబ్దం నుండే అనేక తప్పుడు బోధలు ప్రచారం చేసారు, ఇప్పటికీ కూడా చేస్తున్నారు (మత్తయి 28:11-15)

అంతే కాకుండా పునరుత్థానము తరువాత జరిగిన సంఘటనలు ఏ ఒక సువార్తలో కూడా క్రమ పద్దతిలో వ్రాయబడలేదు. అయితే ఆ నాలుగు సువార్తలను క్షుణ్ణముగా పరిశీలిస్తే ఆ సువార్తల భావం, ఉద్దేశ్యం ఒకటే అని యేసు క్రీస్తు చనిపోయి తిరిగి పునరుత్థానుడు అయ్యాడని, దానికి అనేకమంది ప్రత్యక్ష సాక్షులు కలరని ఆ సువార్తలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాలన్నిటిని కూడా ఒక క్రమ పద్దతిలో పొందుపరచడం జరిగినది. ఈ సందేశం బైబిలును క్రమముగా చదివే వారికి, దైవజనులకు, బైబిలు పరిశోధకులకు ఉపయోగపడుతుంది అని భావిస్తూ వ్రాయడం జరిగినది.

1) ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను. (మత్తయి 28:2)

2 ) ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేనే మరియ, యాకోబు తల్లియైన మరియ, సలోమేయు, యోహన్నయు మరి కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరకు వచ్చారు (మత్తయి 28:1; మార్కు 16:1,2; లూకా 24:10-11)
(Note: చాలా మంది కేవలం మగ్ధలేనే మరియ, యాకోబు తల్లి అయిన వేరొక మరియ మాత్రమే సమాధి దగ్గరకు వచ్చారు అనుకొంటారు కాని చాలా మంది స్త్రీలు అక్కడకు వచ్చారు. ఈ విషయం లూకా స్పస్టముగా వ్రాసాడు. మత్తయి, మార్కు అయన పునరుత్థానుడు అయ్యాడని తెలపడానికి ప్రత్యేకముగా కొంతమంది స్త్రీల పేర్లు వ్రాసారు. అయితే లూకా వారికంటే ఎక్కువగా స్పస్టముగా వ్రాసాడు. ఏది ఏమైనప్పటికీ వారి భావం ఒక్కటే. యేసు క్రీస్తు మరణించి తిరిగి లేచాడని స్పష్టం చేసారు. )

3 ) మగ్ధలేనే మరియ సమాధి దగ్గరకు వచ్చి రాయి పోర్లింపబడి ఉండుట చూసి, తిరిగి వెనక్కి వెళ్లి పేతురుకు, మరియొక శిష్యుడికి ప్రభువును ఎత్తుకొని పోయారు అని చెప్పెను (యోహాను 20:1-3)
(Note: మిగతా స్త్రీలు సమాధి దగ్గర యేసు క్రీస్తును వెదకుచున్నారు – లూకా 24:3)

4 ) యేసు క్రీస్తును వెదకుచున్న స్త్రీలతో ప్రభువు దూతలు మాట్లాడారు (మత్తయి 28:4-7, మార్కు 16:2-8, లూకా 24:1-8)

5 ) ఆ స్త్రీలు సమాధి దగ్గర జరిగిన సంగతులను శిష్యులకు వివరించడానికి బయలుదేరారు (మత్తయి 28:8)

6 ) పేతురు మగ్ధలేనే మరియ చెప్పిన సంగతులు విని సమాధి దగ్గరకు వచ్చి చూసాడు (యోహాను 20:3-10, లూకా 24:12)

7 ) మగ్ధలేనే మరియ బయట నిలిచి ఏడ్చుచూ ఉండెను (యోహాను 20:11)

8 ) యేసు క్రీస్తు తిరిగి లేచిన తరువాత మొదటిగా మగ్ధలేనే మరియకు కనబడెను (యోహాను 20:11-18, మార్కు 16:9)

9 ) సమాధి దగ్గర జరిగిన సంగటనలు శిష్యులకు వివరించడానికి బయలుదేరిన స్త్రీలకు క్రీస్తు కనబడెను (అందరికి కాదు) ఇది రెండవ ప్రత్యక్షత, ఇక్కడ మగ్ధలేనే మరియ లేదు. (మత్తయి 28:8,9)

10 ) క్రీస్తు దేహాన్ని శిష్యులు ఎత్తుకొని పోయారని అబద్దం చెప్పుటకు సైనికులకు ప్రధాన యాజకులు ద్రవ్యమిచ్చి అలా ప్రచారం చేయించారు. (మత్తయి 28:11-15)

11 ) కొందరు స్త్రీలు సమాధి దగ్గర జరిగిన సంగతులను శిష్యులకు, మరి కొందరికి తెలియజేసారు, అయితే వారు నమ్మలేదు (లూకా 24:10,22-24;)

12 ) మగ్ధలేనే మరియ యేసు క్రీస్తు బ్రతికి ఉన్నాడని శిష్యులకు తెలియజేసెను (యోహాను 20:18, మార్కు 16:10-11)

13 ) పేతురు అనబడిన సీమోనుకు యేసుక్రీస్తు కనబడెను. ఇది మూడవ ప్రత్యక్షత (లూకా 24:34, 1 కోరింధి 15:5)

14 ) ఎమ్మాయు అను గ్రామమునకు వెళ్ళుచున్న ఇద్దరు వ్యక్తులకు యేసు క్రీస్తు కనబడెను. ఇది నాల్గవ ప్రత్యక్షత (లూకా 24:13-31, మార్కు 16:12,13)

15 ) తరువాత పది మంది శిష్యులకు కనబడెను. ఇది శిష్యులకు మొదటి ప్రత్యక్షత (యోహాను 20:19-24, లూకా 24:36-41), ఇందులో తోమా లేడు.

16 ) 8 రోజుల తరువాత తోమాతో కలిపి పదకొండు మంది శిష్యులకు కనబడెను (యోహాను 20:26-29, మార్కు 16:14)
(Note: మార్కు 16:14 వచనం క్రీస్తు రెండవసారి శిష్యులకు ప్రత్యక్షమగుట గురించి చెప్పబడినది. ఎందుకంటే యేసు క్రీస్తు శిష్యులకు మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు 11 మంది శిష్యులు లేరు (తోమా లేడు)

17 ) తరువాత తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా ప్రత్యక్షం అయ్యాడు. ఇది ఏడవ ప్రత్యక్షత శిష్యులకు మూడవది. (యోహాను 21:1-14)

18 ) పేతురు మరియు యేసుక్రీస్తు మధ్య సంభాషణ (యోహాను 21:15-23)

19 ) 500 మందికి పైగా కనబడెను. ఇది ఎనిమిదవ ప్రత్యక్షత (1 కోరింధి 15:6)

20 ) తరువాత యకోబుకు కనబడెను. ఇది తొమ్మిదవ ప్రత్యక్షత (1 కోరింధి 15:7)
(Note: ఏ యకోబునకు కనబడెను అనేది స్పస్టముగా తెలియదు. బహుశా యేసు క్రీస్తు సహోదరుడు అయి ఉండవచ్చు. [గలతీ 1:19])

21 ) యేసు క్రీస్తు పునరుత్థానుడయ్యిన తరువాత 40 రోజులు ఈ భూమి మీద ఉన్నారు (అపో. కార్యములు 1:3)
ఈ మధ్యలో మత్తయి 28:16-20, మార్కు 16:15-20, లూకా 24:44-49 లో వ్రాయబడిన సంగతులు జరిగాయి

22 ) పరలోకానికి వెళ్లేముందు చివరిసారిగా శిష్యులకు, మరికొంతమందికి కనబడెను (లూకా 24:50-53, అపో. కార్యములు 1:6-11, 1 కోరింధి 15:7)

మొత్తానికి యేసు క్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తరువాత 40 రోజులలో ఇంచుమించు 11 లేదా 12 సార్లు తనను ప్రత్యక్షపరచుకొనినట్లుగా బైబిలులో కనబడుతుంది, అంతకంటే ఎక్కువ సార్లు కూడా కనబడి ఉండొచ్చు. కనుక యేసు క్రీస్తు తిరిగి లేచాడు అనడానికి అనేక మంది సాక్షులు కలరు. ఆ సాక్షులలో కొంతమంది హతసాక్షులు అయ్యారు.

దేవుడు క్రీస్తును లేపెనని, ఆయననుగూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా? మృతులు లేపబడనియెడల దేవు డాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు. (1 కోరింధి 15:15,20-22)